ఆమె కోసం అతిధి పాత్రలో జూ. ఎన్టీఆర్…!

టాలీవుడ్ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లకు తోడు, కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటం..


అలాగే బుల్లితెరపై తొలిసారి బిగ్ బాస్ రియాల్టీ షో రూపంలో మెరుస్తుండటం.. ఎన్టీఆర్ తో పాటు ఫ్యాన్స్ కు కూడా ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక ఇప్పుడేమో అంతకుమించి అనేలా.. ‘మహానటి’ పేరుతో తెరకెక్కుతోన్న సావిత్రి బయోపిక్ లో చిన్న పాత్రలో అలరించడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పేసినట్లేనని తెలియడం విశేషం. అది కూడా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి పాత్రలో కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.

ఈ మేరకు ప్రియాంక దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ క్రేజీ బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలు ఉంటాయని మొదట్నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ రోల్స్ లో జూ. ఎన్టీఆర్ – నాగచైతన్య లు కనిపిస్తారా అంటే.. కొంచెం కష్టమే అనే టాక్ వినిపించింది. కానీ, తాజాగా తారక్ ను సంప్రదించి ఈ ప్రాజెక్టు గురించి చర్చిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ గా కేవలం కొన్ని నిముషాలు తెరపై అలరించడానికి జూనియర్ దాదాపుగా ఒప్పుకున్నట్లేనని తాజా ఇన్నర్ టాక్. ఇదే నిజమైతే, ఏఎన్నార్ పాత్రకు అక్కినేని వారసుడు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదంతా నిర్మాత అశ్వనీదత్ కు వాళ్ళతో ఉన్న అనుబంధం వల్లే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఇకపోతే, ఇప్పటికే కీర్తి సురేష్, సమంత లతో పాటు మలయాళ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ‘మహానటి’ లో ఉన్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు యంగ్ టైగర్ కూడా ఎంట్రీ ఇస్తే.. ఈ ప్రాజెక్ట్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. మరి సావిత్రి కోసం జూనియర్ ఎంతవరకు ముందుకొస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే, బాలయ్య ఈ మధ్యే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తామని, అందులో ఆయన పాత్రను నేనే పోషిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు పరిస్థితుల బట్టి చూస్తే.. బాలయ్య కంటే ముందే సీనియర్ ఎన్టీఆర్ గా తెర మీద జూనియర్ ఎన్టీఆర్ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Add your comment

Your email address will not be published.