కళాతపస్వికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు

admin
viswanath

2016 సంవత్సరానికిగాను కె.విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును ప్రకటించింది.

సంగీతం, సాహిత్యం, కళ… విశ్వనాథుని చిత్రాలన్నీ వీటి నేపథ్యంలోనే సాగాయి. ఆయన కథానాయకుడికి పోరాటాలు రాకపోయినా పాట పాడడం వస్తుంది. ఆయన నాయికకు అందంతో పాటు, విజ్ఞత ఉంటుంది. వెండి తెరపై హీరోయిజానికి కళాత్మక నిర్వచనం ఇచ్చారు విశ్వనాథ్‌. చిరంజీవి, బాలకృష్ణ, కమల్‌హాసన్‌.. కథానాయకుడు ఎవరైనా సరే, అంత వరకూ చేసిన పాత్రల్ని, వాటి తాలుకూ ఇమేజ్‌ని సెట్‌ బయట వదిలేసి, ఓ కొత్త నటుడిలా విశ్వనాథ్‌ సృష్టించిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాల్సివస్తుంది. విశ్వనాథ్‌ అంటే దర్శకుడు కాదు.. ఓ విశ్వ విద్యాలయం. అందుకే… దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సైతం ఆయన పేరు పక్కన చేరాలని ముచ్చట పడింది..కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు దక్కింది.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం కె. విశ్వనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అవార్డు మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం జరగనుంది. సీతామాలక్ష్మి, సప్తపది, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శంకరాభరణం, స్వర్ణకమలం, శృతిలయలు, శుభసంకల్పం, స్వయంకృషి, స్వాతిముత్యం, సూత్రధారులు వంటి ఎన్నో సంగీత, నాట్య ప్రధానమైన ఉత్తమ చిత్రాలకు కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. తన సినిమాలలో సామాజిక అంశాలకే ప్రాధాన్యతనిస్తారు.

భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా అయిన కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనతో భారతీయ సినీ ప్రముఖులంతా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారాన్ని దక్కించుకోగా, ‘స్వాతిముత్యం’ చిత్రం ఆస్కార్‌కు అధికారిక ప్రవేశాన్ని దక్కించుకుంది. సంస్కృతికి పెద్ద పీట వేసే విశ్వనాథ్ చిత్రాల్లో నటించేందుకు అవకాశం రావడాన్ని నటీనటులంతా మహాభాగ్యంగా భావిస్తారు.

దర్శకత్వంతో పాటు పలు చిత్రాల్లో ఉదాత్తమైన పాత్రలను కూడా పోషించిన విశ్వానాథ్ ప్రస్తుతం ఈ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ 1957లో విడుదలైన ‘తోడికోడలు’ చిత్రం కోసం సౌండ్ రికార్డింగ్ విభాగం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు. ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు

Tags : , , , , , , , , ,