నంద్యాల ఫ‌లితాల‌తో అఖిల ప్రియ చాప్ట‌ర్ క్లోజా?

admin
nandyal

నంద్యాల ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ రాక ముందు టీడీపీ, వైసీపీ అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌టంతో రాజ‌కీయం హీటెక్కింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇరు పార్టీలు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయో వేరే చెప్ప‌న‌క్క‌ర లేదు.


షెడ్యూల్ రాక ముందే ఇరు పార్టీలు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌టంతోనే ఈ ఎన్నిక‌ల ప్రాధాన్య‌త ఏమిటో స్ప‌ష్టం అవుతుంది. ఎన్నిక‌ల అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌టం ఒక ఎత్తు అయితే, వారు ఈ ఎన్నిక‌ల ఫలితాల‌పై స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్ల‌తో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వీటికి నేత‌లు క‌ట్టుబ‌డి ఉంటే మాత్రం ఎవ‌రో ఒక‌రు రాజ‌కీయ స‌న్యాసం ఖాయ‌మంటున్నారు.

నంద్యాల అసెంబ్లీ స్ధానానికి అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్న సంగ‌తి తెల్సిందే. సాంకేతికంగా వైసీపీ సీటు అయినా, అభ్య‌ర్ది టీడీపీలో ఉండ‌టంతో ఎన్నిక‌లు అనివార్య మైన సంగ‌తి తెల్సిందే. దాంతో టీడీపీ త‌ర‌పున ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను త‌న భుజ‌స్కందాల వేసుకున్న అఖిల ప్రియ నంద్యాల ఎన్నికల్లో ఓడిపోతే తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆమె తెలిపారు. అంతే కాకుండా రాజ‌కీయాల‌కు కూడా దూరంగా ఉంటాన‌ని కూడా పేర్కొన్నారు. అఖిల ప్రియ స‌వాళ్లుకు వైసీపీ అభ్య‌ర్ది శిల్పా మోహ‌న్ రెడ్డి కూడా ప్ర‌తి స‌వాల్ విసిరారు. తాను కూడా ఎన్నిక‌ల్లో ఓడిపోతే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లుకుతాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న ఓ ష‌ర‌తు విధించారు. అఖిల ప్రియ చేసిన స‌వాల్‌ను ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో చేయాల‌ని, దానికి చివ‌రి వ‌ర‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఆయ‌న మ‌రో స‌వాల్ విసిరారు. దానికి అఖిల ప్రియ నుంచి ఇంకా స్పంద‌న రాలేదు. అయితే అఖిల ప్రియ దాన్ని స‌వాల్‌గా స్వీక‌రించి ఓకే చెబితే మాత్రం నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక‌లు మ‌రింత ర‌స‌కందాయంగా సాగుతాయ‌న‌టంలో ఎటువంటి సందేహం అక్క‌ర లేదు.

అయితే నేత‌లు చేసుకున్న స‌వాళ్లుకు క‌ట్టుబ‌డి ఉంటారా? అనేదే ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌. నంద్యాల గ‌త(2014) ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసి విజ‌యం సాధించిన భూమానాగిరెడ్డి 82194 సాధించగా, ఆనాడు టీడీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసిన శిల్పా మోహ‌న్ రెడ్డి 78590 ఓట్లు సాధించారు. 3608 ఓట్ల‌ స్వ‌ల్ప తేడా తో నాగిరెడ్డిపై శిల్పా ఓడిపోయారు. ఇప్పుడు వీరువార‌య్యారు. ఎంతో బ‌ల‌మైన అభ్య‌ర్ది అయిన నాగిరెడ్డి లేరు. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా సోద‌రుడు కుమారుడు బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి బ‌రిలో దిగారు. ఆయ‌న అభివృద్ది నినాదంతో ఓట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్తామ‌ని ప్ర‌టించారు. ఏపీలో చోటు చేసుకున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నినాదం ప‌ని చేసే అవ‌కాశం లేదు. దానికి తోడు భూమా ప్ర‌త్య‌ర్దులంతా ఇప్పుడు వైసీపీలో చేరారు. ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త కూడా స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా ఇదీ రుజువైంది. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు క్యాంపులు పెట్టి, డ‌బ్బులు వెద‌జ‌ల్లి టీడీపీ అభ్య‌ర్దుల‌ను గెలిపించుకోగ‌ల్గారు కానీ గ్రాడ్యేట్స్ ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఎత్తులు పార‌లేదు.

దానికి తోడు ఇటీవ‌ల చంద్రబాబు నిర్వ‌హించిన ఇఫ్తార్ విందు కూడా అట్ట‌ర్ ప్లాప్ అయింది. దాంతో స‌హ‌నం కోల్పోయిన చంద్ర‌బాబు ఫ్యాన్ ను త‌న్నేర‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇంత వ‌ర‌కు చోటు చేసుకున్న ప‌రిణామాల‌న్నీ కూడా టీడీపీ ప‌ట్ల సానుకూల‌మైన ప్ర‌భావాన్ని మాత్రం చూప‌టం లేదు. దానికి తోడు చంద్ర‌బాబు టెన్ష‌న్‌కు గురి చేయ‌టం వ‌ల్లే భూమా నాగిరెడ్డికి గుండె పోటు వ‌చ్చింద‌నే ప్ర‌చారం ప్ర‌త్య‌ర్దులు చేస్తూనే ఉన్నారు. గ‌తంల భూమా అనుచ‌రులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు అఖిల ప్రియ‌తో విభేదిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌న్నీ విశ్లేషిస్తే మాత్రం టీడీపీ విజ‌యం ఎట్లా సాధ్య‌మ‌నే కంక్లోజ‌న్‌కే వ‌స్తాం. అయితే అఖిల ప్రియ మాత్రం ప్ర‌క‌టించిన‌ట్లుగా నంద్యాల‌లో ఓడిపోతే రాజ‌కీయాల‌ను త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత అఖిల ప్రియ చాప్ట‌ర్ క్లోజా అనే వాద‌న‌లు మొద‌లైనాయి. అయితే ఏదైనా అనుకోని సంఘ‌న‌లు చోటు చేసుకుని ఫ‌లితాలు తారుమారు అయితే శిల్పా రాజకీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో నంద్యాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం ఎవ‌రో ఒక‌ర్ని రాజ‌కీయాల‌కు దూరం చేస్తాయ‌న మాట‌!

Tags : , , , , , , , , , , , , , , , , , , ,