విశాఖ భూ కుంభ కోణంపై సీబీఐ ఎంక్వేరి?

mohanrao
cbi

విశాఖ ప‌రిస‌ర ప్రాంతాల్లో చోటు చేసుకున్న బూ కుంభ‌కోణం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వెన్నులో వ‌ణుకు ప‌ట్టిస్తుంది.

అధికార ప‌క్షంలోని ఒక వ‌ర్గం, ప్ర‌తిప‌క్షం, మిత్ర‌ప‌క్షాలు స‌మిష్టిగా సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనేక కుంభ‌కోణాలపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తినా చంద్ర‌బాబు వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా చంద్ర‌బాబు నాయుడు వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యించినా, చివ‌రికి విచార‌ణ‌కు ఆదేశించ‌క త‌ప్ప‌దంటున్నారు.

విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యరాయణ, మంత్రి అయ్య‌న్న పాత్రుడు, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వ‌రిలు డిమాండ్ చేశారు. రికార్డుల టాంపరింగ్ స్కామ్ పై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. అసలు విశాఖలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని, వాటి గురించి అడిగితే హుద్ హుద్ తుపానులో కొట్టుకుపోయారని అంటున్నారని తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణం త‌న రాజ‌కీయ జీవితంలోఎప్పుడూ చూడలేదన్నారు. భూస్కామ్ తో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వేల ఎకరాల భూములను దోచేస్తున్నారని, ప్రభుత్వ భూములను కాపాడుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఏం జరుగుతుందో చెప్పాలని చంద్ర‌బాబును డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా జరగదని మంత్రులే అంటున్నారని తెలిపారు. ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోరు? ఎవర్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలోనే భూస్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సమ్మిట్ల పేరుతో విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని బొత్స సత్యరాయణ విమర్శించారు

ప్ర‌తిప‌క్షం సంగ‌తి అలా ఉంటే మిత్ర ప‌క్షం కూడా ఈ కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ కోర‌టంతో చంద్రబాబు మ‌రింత ఇర‌కాటంలో ప‌డ్డారు. ఈ కుంభ‌కోణంపై బీజేపీ నేత ఏమ‌న్నారంటే..

తాను హోం మంత్రినైతే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్కతీస్తానని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు వ్యాఖ్యానించారు. భూ కుంభకోణమంతా నగరం సమీపంలోని భీమిలి ప్రాంతం చుట్టూనే తిరుగుతోందన్నారు. జిల్లా అంతటా అక్రమాలు ఉన్నా… భీమిలిలో భూ దందా పతాకస్థాయికి చేరిందన్నారు. ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూ కుంభకోణం జరిగిందని అందరూ చెబుతున్నా.. ఎవరూ పెద్ద వాళ్ల పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు. పక్కా ఆధారాలు తన వద్ద లేవు కాబట్టే తాను పేర్లు బయటపెట్టడం లేదని, అయితే అక్రమాలు జరిగిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితే గానీ వాస్తవాలు బయటకు రావని అన్నారు. భీమిలి ల్యాండ్ ఫూలింగ్ తో పాటు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్ పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భీమిలి, ముదపాక ప్రాంతాల్లో వుడా ల్యాండ్ పూలింగ్ పేరిట జరిగిన వందల రూ.కోట్ల కుంభకోణంపై తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అధికారుల్లోనూ కొంతమంది అవినీతిపరులు ఉన్నప్పటికీ, రాజకీయ నేతల అండ లేకుండా రికార్డుల ట్యాంపరింగ్ చేసేంతటి ధైర్యం వారికి ఉండదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ కుంభ‌కోణంపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం విచార‌ణ జ‌ర‌పాల‌ని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించాలన్నారు

మిత్ర‌ప‌క్షం, ప్ర‌తిప‌క్షాల‌తో గొంతు క‌లిపిన చింత‌కాయ‌ల‌

ఈ భూ కుంభ‌కోణంపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎటు పోతోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన ఆయన తాను నిజాలే మాట్లాడుతానన్నారు. నిజాలు మాట్లాడితే మంత్రి పదవి పోయినా సరే తాను వెనుకడుగు వేయనని వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన భారీ కుంభకోణంపై ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే విశాఖ ప్రజలు తిరగబడి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కుంభకోణాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని మంత్రి పిలుపిచ్చారు. పరోక్షంగా ఆయన మంత్రి గంటాపై ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖలో జరిగిన వేల ఎకరాల భూ కుంభకోణంపై ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. నారా లోకేష్‌ వెనకుండి వారితో కుంభకోణాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయినా ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ అసలు కుంభకోణమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రే సంచలన ఆరోపణలు చేయడం టీడీపీలో చర్చనీయాంశమైంది.

అధికార ప‌క్షం, మిత్ర ప‌క్షాలే కాకుండా కేబినెట్ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కూడా ఈ కుంభ‌కోణంపై బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌టంతో చంద్ర‌బాబు నాయుడ్ని మరింత‌గా ఇర‌కాటంలో పెట్టింది. ఆయ‌న సీబీఐ విచార‌ణ కోర‌క‌పోయినా మిగిలిన ప‌క్షాలు సీబీఐ విచార‌ణ కోరాటం చంద్ర‌బాబు నాయుడు ఈ కుంభ‌కోణంపై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాల్సిన ప‌రిస్థితి నెల‌కుందంటున్నారు.

Tags : , ,