చిన్నమ్మ చేతుల్లోకే పార్టీ పగ్గాలు?

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుగులేని నేతగా ఇన్నాళ్లూ పార్టీని నడిపించిన జయలలిత మరణించడంతో ఇప్పుడు ఆమె స్థానంలో శశికళకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు

అన్నాడీఎంకేలో ‘ప్రధాన కార్యదర్శి’ సర్వాధికారి. ఈ పదవిని ఇప్పుడు ఎవరు చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది. జయలలిత వెంట ఇన్నాళ్లూ నీడలా నడయారి ఆమె కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న ప్రాణ సఖి ‘శశికళ నటరాజన్‌’ ఈ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. తన స్నేహితుడు డీఎంకే నేత కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల వల్ల డీఎంకేను వీడి నటుడు ఎంజీఆర్‌ 1972లో అన్నాడీఎంకేను స్థాపించారు. ఆయన బతికున్నంత కాలం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయనే. ముఖ్యమంత్రీ ఆయనే. ఏక కాలంలో పార్టీని, ప్రభుత్వాన్నీ విజయవంతంగా నడుపుతూ వచ్చారు. ఆయన మరణించిన తరువాత వివిధ నాటకీయ పరిణామాలతో 1987లో జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. ఇక అప్పటి నుంచీ మరణించే వరకూ ఆమే పార్టీకి ఏకైక దిక్కు. ఏడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికైన జయలలిత సరికొత్త చరిత్ర లిఖించారు. ఆమె బతికున్నన్ని రోజులూ ఆ పార్టీ నేతలు కనీసం ఆమెకు ప్రత్యామ్నాయం అనే వూహ కూడా చేయడానికి సాహసించే ప్రయత్నం చేయలేకపోయారు.

తన వారసులు వీళ్లు అని జయలలిత ఏనాడూ కూడా ప్రకటించలేదు. అయితే జయ పంచన అంటిపెట్టుకుని ఉన్న ఆమె ప్రాణస్నేహితురాలు ‘శశికళ నటరాజన్‌’ ఆమె కుటుంబ సభ్యుల పార్టీలో తెరవెనుక చక్రం తిప్పి పార్టీలో తమ ఆధిపత్యం చాటేవారు. జయ చుట్టూ ఆమె కుటుంబ సభ్యులే ఒక పెద్ద కోటలా ఉంటారు. ఆ కోటను దాటుకుని జయలలితను ఇతరులు కలవడం దాదాపుగా అసాధ్యం. అంతలా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారు పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో ‘శశికళ’ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.

సీఎం పదవి ఎందుకు వద్దన్నారంటే…

వాస్తవానికి జయ తర్వాత పగ్గాలు శశికళ చేపట్టాలనే అభిప్రాయాలు కూడా పార్టీలో వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పలు కారణాల రీత్యా దాన్ని సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది తేలకుండా ఇలా సీఎం పదవి చేపట్టడం తొందరపాటు అవుతుందని ఆమె భావించినట్లు సమాచారం. జయలలిత మరణించిన ఈ దుఃఖ సమయంలో సీఎం పదవి చేపడితే పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయం కూడా వచ్చినట్లు తెలిసింది. వాటికంటే తమకు ఎంతో విశ్వాసపాత్రుడు, పార్టీలో వివాదరహితుడైన ‘పన్నీర్‌సెల్వం’కే ఆ పగ్గాలు కట్టబెట్టాలని ఆమె నిర్ణయించారు. ‘పోయెస్‌గార్డెన్‌’ నుంచీ జయలలిత తరహాలోనే ఆమె చక్రం తిప్పనున్నారు.

టీ దుకాణం యజమాని నుంచి సీఎం దాకా…

తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా పెరియకులం గ్రామానికి చెందిన ఒట్టికార దేవర్, పళనియమ్మాల్‌కు 1951 జనవరి 14వ తేదీ పన్నీర్‌సెల్వం జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ఆయన వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ పెరియకులంలో టీ దుకాణం నిర్వహించే వారు. ఎంజీ రామచంద్రన్ అభిమాని అయిన సెల్వం అనూహ్య పరిణామాల నేపథ్యంలో 1996లో పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2001 ఎన్నికల్లో అమ్మ ఆశీస్సులతో బోడినాయకనూరు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచే జయకు నమ్మినబంటుగా మారారు.

Add your comment

Your email address will not be published.