‘జయ’ వారసుడిగా ‘అజిత్’..?

surendra a
ajith

జయలలిత వారసుడిగా సినీ నటుడు ‘అజిత్’ తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో తన వారసుడిని జయలలిత ఎప్పుడో ఎంపిక చేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సినీ నటుడు ‘అజిత్’ ఆమెను ‘అమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. పొయెస్‌ గార్డెన్‌కు నేరుగా చేరుకునే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అజిత్ కూడా ఒకరు. ‘జయ’ మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోకుండా యథాతథంగా కొనసాగాలన్నా.. బలమైన ప్రత్యర్థిగా ఉన్న డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా ‘అజిత్’ వంటి వ్యక్తిని వారసుడిగా తెరపైకి తీసుకు రావడమే మంచిదనే అభిప్రాయాలను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకేలో కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌ రూపంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు జయ తర్వాత అంతే బలమైన నాయకత్వం లేకపోతే, తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే నిలదొక్కుకోవడం కష్టమనే అంచనాలూ వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, తమిళనాట ప్రజాకర్షణ కలిగిన అజిత్ అయితేనే పార్టీని కొనసాగించగలరని అంటున్నారు. జయలలిత, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న వ్యక్తి అజిత్. జయలలిత కూడా ఇదే విషయాన్ని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారని, పన్నీరు సెల్వం, అజిత్‌కు చేదోడు వాదోడుగా ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మరణానంతరం ‘పన్నీరు సెల్వం’ ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని ఇప్పటికే ఆమె పార్టీ వర్గాలు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Tags : , , , , , , , , ,