‘ప్రత్యేక హోదా’ పై.. పవన్ ఇక మారరా! |Pawan Kalyan Press Meet For AP Special Status

admin
pawan

రాష్ట్ర విభజన రీత్యా ఆంధ్రప్రదేశ్ కు లభించాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దోబూచులాడుతూ ‘ప్రత్యేక ప్యాకేజ్’ను ప్రకటించడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగిపోయిన విషయాలు.

ఈ ప్రక్రియలో ‘ప్రత్యేక హోదా’పై కేంద్రం చాలాసార్లు స్పష్టమైన ప్రకటన చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, అందుకే ప్యాకేజ్ ఇచ్చామని సమర్ధించుకుంది. అప్పటివరకు కాస్తో కూస్తో ప్రత్యేక హోదాపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, కేంద్రం ప్రకటనల తర్వాత సైలెంట్ అయిపోయారు.
తాజాగా మరోసారి ‘ప్రత్యేక హోదా’పై గళం విప్పారు పవన్. స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్ర హక్కు అని అన్న పవన్, దానిని సాధించేందుకు తాను వెనక్కి తగ్గబోనని అన్నారు. ఇదంతా బాగానే ఉంది… అయితే ప్రత్యేక హోదా కోసం పవన్ ఏం చేస్తున్నారు? అంటే అంతా నోరెళ్ళబెట్టాల్సిందే. మరో శోచనీయమైన విషయం ఏమిటంటే… ఇప్పటికే కొన్ని వందల సార్లు ‘తాము ఇవ్వబోమని’ స్పష్టంగా చెప్పిన కేంద్రం, మళ్ళీ స్పష్టంగా చెప్పాలని పవన్ డిమాండ్ చేస్తుండడం. దీంతో పవన్ లో ఇంకా ఆ గందరగోళ పరిస్థితి తగ్గలేదన్న విషయం స్పష్టమవుతోంది.

ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ మినహా కేంద్రంలో ఉన్న ప్రముఖ మంత్రులు, రాజకీయ నాయకులందరూ ఏపీ ‘స్పెషల్ స్టేటస్’పై కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. ఇంకా ‘పవన్’కు రావాల్సిన స్పష్టత ఏమిటో ప్రజలకు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. బహుశా ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట నుండి కూడా ఆ మాటను చెప్పించాలని చూస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. మోడీ కూడా చెప్పిన తర్వాత, తన స్పెషల్ స్టేటస్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పవన్ భావిస్తున్నారా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

అయితే పవన్ నుండి ఓ స్పష్టమైన ప్రకటన రాకుండా ఇలాగే దోబూచులాడే వ్యాఖ్యలు చేయడం విస్మయానికి గురిచేసే అంశం. నిజంగా మోడీ నుండి కూడా అదే వ్యాఖ్య వచ్చిన తర్వాత పవన్ ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయం గమనించుకోవాలి. ఎందుకంటే, నేడు కాకపోతే రేపైనా మళ్ళీ మోడీనే అధికార పీఠం ఎక్కబోతున్నారన్నది బహిరంగ సత్యం. అలా అని మోడీ ఏం చేసినా చేతులు కట్టుకుని కూర్చోవాలన్న విషయం కూడా మంచిది కాదు.

పోరాడాల్సిన సమయం అంతా ఇలా వేచిచూస్తా ఉంటే, కేంద్రానికి పవన్ సీరియస్ నెస్ ఎలా అర్ధమవుతుంది. తాను నిరసన ప్రదర్శనలు చేయను.., నిరాహార దీక్షలు చేయను.., రొటీన్ రాజకీయాలు అసలే చేయను అన్న పవన్ ధోరణి బాగానే ఉంది గానీ, వర్తమాన రాజకీయాలలో ఇవి లేకుండా ఏమైనా సాధించగలుగుతారా? ‘స్పెషల్ స్టేటస్’ను కేంద్రానికి అర్ధమయ్యే విధంగా చెప్పడంలో పవన్ తో సహా రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ విఫలమయ్యారనడానికి ఇదొక తార్కాణం.

Tags : , , , , , , , , , , , , , ,