జ‌గ‌న్ పై సీబీఐ కేసులు కంచికేనా? విచార‌ణ‌కు నోచుకోని వైనం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులు రోజు రోజుకి బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తున్నాయి.

ఈ కేసులో జ‌గ‌న్ త‌ర్వాత తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఐఎఎస్ అధికారి శ్రీ‌ల‌క్ష్మిపై న‌మోదు చేసిన ప్ర‌ధాన అభియోగాల‌కు విచార‌ణ‌కు నోచుకోకుండ‌నే హైకోర్టు కొట్టివేసింది. దాంలో సీబీఐ కేసులు ఎంత డొల్ల‌గా ఉన్నాయో మ‌రో సారి తేలిపోయింది. ఇప్ప‌టికే జ‌గ‌న్ తో పాటు కేసులు న‌మోదు చేయ‌బ‌డిన అధికారులు వ‌ర‌స‌గా హైకోర్టు నుంచి ఊర‌ట పొందుతున్నారు. తాజాగా శ్రీ‌ల‌క్ష్మి కూడా హైకోర్టు లో ఊర‌ట పొందారు. సీబీఐ కేసు విచార‌ణార్హ‌తకు కూడా నోచుకోవ‌టం లేదంటే సీబీఐపై ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసిన‌ట్లుగానే ప‌లువురు భావిస్తున్నారు.

జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో పస లేకపోవడంతో ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఐఏఎస్‌లపై ఉన్నత న్యాయస్థానాలు అభియోగాలను కొట్టిపారేశాయి. తాజాగా ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టిపారేసింది. ఆమెపై ఐపీసీలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేసింది. శ్రీలక్ష్మి కుట్రకు, మోసానికి, విశ్వాసఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని అందుకే ఆమెపై అభియోగాలను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్‌రావు గురువారం తీర్పు చెప్పారు.

కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ అన్యాయంగా కేసులు నమోదు చేసిందని వాటిని కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన హైకోర్టు ఆమెపై అభియోగాలను కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగి దుష్‌ ప్ర‌వర్తన కింద నమోదైన ఒక కేసును మాత్రం హైకోర్టు కొట్టివేయలేదు. అది మినహా మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో అత్యంత ఇబ్బంది ఎదుర్కొన్నది శ్రీలక్ష్మియే. జగన్‌ను ఇరికించేందుకు శ్రీలక్ష్మిని అప్పటి ప్రభుత్వాలు ఒక పావులా వాడుకున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. శ్రీ‌ల‌క్ష్మిపై అప్పుడు పుంకాను పుంకాలుగా వార్త క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. ఈ కేసువేధింపులు భరించలేక తీవ్ర అనార్యోగానికిగురై చాలాకాలంగా నడవడానికి కూడా శ్రీలక్ష్మి ఇబ్బందిపడ్డారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు కేసులను కూడా హైకోర్టు కొట్టివేయడంపై తోటి ఐఏఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జ‌గ‌న్‌తో పాటు ప‌లువురు ఐఎఎస్‌ల‌పై న‌మోదు చేయ‌బ‌డిన కేసులు రాజ‌కీయ ప్రేరేపిత‌మ‌ని చంద్ర‌బాబుతో స‌హా అంద‌రూ అంగీక‌రిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులు నివ‌టం అసాధ్య‌మ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Add your comment

Your email address will not be published.