తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? ఐతే వీటి గురించి తెలుసుకోండి!

surendra a
tirumala

శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకునే భక్తులు ఈ విషయాలు తెలుసుకోండి

వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల కొండకు చేరుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మరెక్కడాలేని విధంగా తిరుమల సప్తగిరులు భక్తుల గోవిందనామ స్మరణతో నిత్యం మారుమోగుతుంటాయి. సగటున రోజుకు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక సౌకర్యాలు సమకూరుస్తోంది. స్వామిని దర్శించుకోవడానికి టీటీడీ పలు రకాల దర్శనాలు ఏర్పాటు చేసింది.

సర్వదర్శనం

సర్వదర్శనాన్నే ఉచిత దర్శనం అంటారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా కొండకు వచ్చే భక్తులు వెళ్లే క్యూలను సర్వదర్శనం అని పిలుస్తారు. వీరు వైకుంఠం-2లో వేచి ఉంటారు. రోజులో వీరికి 18 నుంచి 20 గంటల పాటు స్వామి దర్శనాన్ని కల్పిస్తారు. వీరు వేచిఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క్యూలు విశాలంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వదర్శనం భక్తులకు పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం, పాలు, మజ్జిగ, టీ, కాఫీ అందజేస్తారు. అలాగే మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యూల వద్ద ఉచిత వైద్య సదుపాయం ఉంది. భక్తులు ఉండే కంపార్టుమెంట్‌లోనే రూ.70కి నాలుగు లడ్డూల టోకెన్లు విక్రయిస్తారు.

దివ్వదర్శనం

కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకునే విధానాన్ని దివ్వదర్శనం అంటారు. అలిపిరి, శ్రీవారిమెట్టు ద్వారా కాలినడకన తిరుమ లకు వచ్చే భక్తులకు మార్గం మధ్యలో దివ్వదర్శనం టోకెన్లు మంజూరు చేసి ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తారు. తిరుమలకు చేరుకున్న వీరు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ ద్వారా లోనికి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. కాలి నడకన వచ్చే భక్తులకు ఓ లడ్డూ ఉచితంగా కూడా ఇస్తారు.

రూ.300 ఆన్‌లైన్ దర్శనం

ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు పొందిన భక్తులు తాము నమోదు చేసుకున్న టైం స్లాట్‌లో శ్రీవారిని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. తాము నమోదు చేసుకున్న టికెట్లను నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్‌లో స్కాన్ చేసుకుని దర్శనానికి వెళ్లాలి. రెండు గంటల వ్యవధిలోనే వీరికి దర్శనం పూర్తవుతుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శనం

65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మహద్వారం నుంచి ఆలయంలోకి అనుమతించి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. 65 ఏళ్లు దాటినట్టు నిర్ధారించే గుర్తింపు కార్డున్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దివ్యాంగులు కూడా సంబంధిత మెడికల్‌ సర్టిఫికెట్‌ చూపించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దర్శనం ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. ఆ సమయాల్లో ఇతర భక్తులను దర్శనానికి లోనికి అనుమతించరు.

చంటి బిడ్డల తల్లిదండ్రుల దర్శనం

ఏడాది వయస్సు కలిగిన చంటి బిడ్డల తల్లిదండ్రులను సుపథం నుంచి వైకుంఠం-1 క్యూ కాంపెక్స్‌లోకి అనుమతిస్తారు. వీరు తమ చంటి బిడ్డతో నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చు. ఆర్జిత సేవలు కలిగిన భక్తులు, ఎన్‌ఆర్‌ఐ (ప్రవాసభారతీయులు), వీదేశీయులు, ధర్మకర్తల మండలి కల్పించే రూ.300 సుపథం ఎంట్రీ భక్తులు ఇదే మార్గంలో ఆలయంలోకి వెళతారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనం

వీఐపీల కోసం ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇతర క్యూలను నిలిపి వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెద్దస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు దర్శనం కల్పించటంతో పాటు వారి సిపార్సు లేఖలకు కూడా వీఐపీ బ్రేక్‌ టికెట్లు ఇస్తారు. వీఐపీ టికెట్ల ధర రూ.500. టికెట్లు పొందిన భక్తులకు ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య దర్శనం కల్పిస్తారు. వీఐపీ టికెట్లలో మూడు విభాగాలున్నాయి. ఇందులో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3.

మహద్వార దర్శనం

దేశ ప్రధాని, కేంద్రమంత్రులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ముఖ్యమంత్రులు, వీదేశీ ప్రధానులకు ప్రొటోకాల్‌ నేపథ్యంలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళతారు. వీరికి మహద్వారం వద్ద టీటీడీ అర్చకులు, ఉన్నతాధికారులు ఇస్తికాఫాల్‌తో(ఆలయ మర్యాదలతో) స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు.

Tags : , , , , , , ,