వైసీపీ – జనసేన మధ్యలో టిడీపీ ఎమ్యెల్యే..!

admin
janasena

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా క‌ప్పుల త‌క్కెడ‌లో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. వ‌రుస‌గా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జ‌న‌సేన సైతం త‌మ స‌త్తా ఏంటో తొలి ఎన్నికల్లోనే చాటాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌లోకి టీడీపీ, వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, టిక్కెట్లు రాని వారు జంపింగ్ చేయ‌డం ఖామమే. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన బ‌లంగా ఉన్న తూర్పు గోదావ‌రి జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారే ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ‌చ్చే ఎన్నికల నాటికి కాస్త ముందుగా వైసీపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్లే ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో తోట చిరు ప్ర‌జారాజ్యం పార్టీలోకి కూడా వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన తోట మ‌రోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో కాపు ఉద్య‌మం టైంలో ముద్ర‌గ‌డ‌ను శాంత‌ ప‌రిచేందుకు తోటనే బాబు ప్ర‌ధాన అస్త్రంగా వాడారు. కాపుల్లో తోట‌కు ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరుంది. అలాంటి తోట త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ క్రమంలోనే వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌న టీడీపీ నుంచి క‌న్నా వైసీపీ లేదా జ‌న‌సేన నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న‌ట్టు టాక్ వ‌స్తోంది. మంత్రి ప‌ద‌వి హామీ ల‌భిస్తే ఆయ‌న వైసీపీ త‌ర‌పున‌ కాకినాడ రూర‌ల్ సీటు నుంచి పోటీ చేస్తాన‌ని అన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉన్న సీనియ‌ర్ నేత పిల్లి బోస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో రామచంద్ర‌పురంలో పోటీ చేసినా చేయ‌క‌పోయినా ఆయ‌న‌కు ఇబ్బంది లేకుండా తోట ముందుగానే కాకినాడ రూర‌ల్ సీటుపై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది.

వైసీపీ నుంచి బ‌ల‌మైన హామీ ల‌భించ‌ని ప‌క్షంలో ఆయ‌న జ‌న‌సేన నుంచి అయినా కాకినాడ రూర‌ల్‌లో పోటీ చేయాల‌ని ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ రెండు పార్టీల మ‌ధ్య ఊగిస‌లాట‌లో ఉన్న తోట ఏం చేస్తారన్న‌దే ప్ర‌స్తుతం తూర్పు రాజకీయంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,