మంత్రి పదవి రాలేదు కానీ.. : నెహ్రూకు ‘బాబు’ ఊరట!

admin
Nehru

వైసిపి నుంచి వచ్చిన మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూకు కొంతలో కొంత ఊరట. జ్యోతుల తనయుడు నవీన్‌ను జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చుండబెట్టనున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం ప్రతిష్టంభన తొలగిందని తెలుస్తోంది.

జ్యోతుల నెహ్రూ 2014లో వైసిపి నుంచి గెలుపొందారు. అయితే జగన్ తీరుపై అసంతృప్తితో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో జ్యోతులకు మంత్రి పదవి వస్తుందని చాలామంది భావించారు. కానీ అది దక్కలేదు.

జ్యోతుల కూడా దీనిపై పెదవి విప్పలేదు. అయితే, ఇప్పుడు జ్యోతులకు చంద్రబాబు ఒకింత ఊరట కలిగించారు. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌గా ఉన్న నామన రాంబాబుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి, జ్యోతుల నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వనున్నారు. అమరావతిలో సోమవారం పార్టీ జిల్లా ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కొన్నిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.

అదే సమయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌ను జడ్పీ ఛైర్మన్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. జులై 5వ తేదీకి జడ్పీ చైర్మన్‌గా నామన రాంబాబు మూడేళ్లు పూర్తి చేసుకుంటారు. అప్పుడు ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత జ్యోతుల నవీన్‌ జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. తనను జడ్పీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తే ప్రత్యామ్నాయంగా ఏదో ఒక కార్పొరేషన్‌ పదవి ఇవ్వాలని, లేదా జడ్పీతో పాటు జిల్లా అధ్యక్ష పదవి కొనసాగించాలని గతంలో నామన రాంబాబు పట్టుబట్టడంతో ప్రతిష్టంభన నెలకొంది.

Tags : , , , , , , , ,