తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు షాక్‌!

surendra a
kabadi

అహ్మదాబాద్‌ లో జరిగిన కబడ్డీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌పై దక్షణ కొరియా సంచలన విజయం

సొంతగడ్డపై, అభిమానుల మద్దతుతో ఏకపక్ష విజయం సాధించి టోర్నీకి వూపు తెస్తారనుకున్న మన యోధులు ఓడిపోయారు. తొలి మ్యాచ్‌లో దక్షణ కొరియా.. భారత్‌ను ఓడించి ప్రకంపనలు సృష్టించింది. దక్షణ కొరియా.. భారత్‌పై గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి.

కబడ్డీ ప్రపంచకప్‌లో భారత్‌కు చేదు అనుభవం. అట్టహాసంగా ప్రారంభమైన టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ 32-34తో దక్షణ కొరియా చేతిలో ఓడిపోయింది. ఆరంభంలో మ్యాచ్‌ గమనానికి… ముగిసిన తీరుకి పొంతనే లేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ సులభంగా గెలుస్తుందనుకున్నా.. దక్షణ కొరియా గట్టిపోటీనిచ్చింది. అయినా అర్ధభాగానికి భారత్‌ (18-13)దే ఆధిపత్యం. ప్రదీప్‌ నర్వాల్‌, రాహుల్‌ చౌదరి జోరు మీదుండడంతో భారత్‌ పెద్దగా కష్టపడకుండానే గెలిచేలా కనిపించింది. అయితే ద్వితీయార్ధంలో దక్షణ కొరియా అనూహ్యంగా పుంజుకుంది. ‘జన్‌ కున్‌ లీ’ రైడ్‌ పాయింట్లు తీసుకురావడంతో ఆ జట్టు 15-18తో భారత్‌కు చేరువైంది. ఈ స్థితిలో ‘మంజిత్‌ చిల్లార్‌’ రెండుసార్లు ప్రత్యర్థి రైడర్‌ను పట్టేయడంతో భారత్‌ 22-15తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశ నుంచే భారత్‌ వెనకబడింది. భారత్‌ను ఆలౌట్‌ చేసి 26-29తో నిలిచిన దక్షణ కొరియా ఆ తర్వాత అంతరాన్ని తగ్గించుకుంటూపోయింది. ఆ తర్వాత ‘జన్‌ కున్‌ లీ’ రైడ్‌ పాయింట్లు తేవడంతో 31-31తో స్కోరు సమం చేసింది. ఈ స్థితిలో రైడ్‌కు వచ్చిన దీపక్‌ హూడాను దక్షణ కొరియా పట్టేయడంతో ఆ జట్టు 33-31తో విజయానికి చేరువైంది. ఆ తర్వాత ‘జన్‌ కున్‌ లీ’ మరో సూపర్‌ రైడ్‌ చేయడంతో దక్షణ కొరియా 34-32తో విజయాన్ని సొంతం చేసుకుంది. రైడర్లు 17 పాయింట్లే తేవడం భారత్‌ను దెబ్బ తీసింది.
kabaddi

మరో మ్యాచ్‌లో ఇరాన్‌ 52-15తో అమెరికాను చిత్తు చేసింది. అంతకుముందు ఈ పోటీలను క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్‌ తారలు అభిషేక్‌ బచ్చన్‌, సునీల్‌ శెట్టితో పాటు బాక్సింగ్‌ స్టార్‌ మేరీకోమ్‌ తదితరులు పాల్గొని భారత జట్టుకు మద్దతు పలికారు.

Tags : , , , , , , , , , , ,