భారత్ ఆరంభమదిరె..!

surendra a
cric

ధర్మశాలలో టీమ్‌ఇండియా తడాఖా తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌ షో.. 6 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం

టెస్టు సిరీస్‌లో కివీస్‌కు శూన్య హస్తం మిగిల్చిన టీమిండియా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి బోణీ చేసింది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ తోడవడంతో ఆదివారమిక్కడ జరిగిన తొలి డే/నైట్‌ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని భారత 33.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. కోహ్లీతో పాటు అజింక్యా రహానె , కెప్టెన్‌ ధోనీ రాణించారు. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, బ్రాస్‌వెల్‌, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు. అంతకు ముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌… 43.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఢిల్లీలో గురువారం జరగనుంది.

ఆడుతూ పాడుతూ..

స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్, రహానె తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆరంభంలో రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడగా రహానె మాత్రం చూడచక్కటి షాట్లతో అలరించాడు. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు సాధించాడు. ఇక, సౌథీ వేసిన ఐదో ఓవర్లో రోహిత సిక్సర్‌తో జోరందుకోగా.. ఆ వెంటనే బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో రహానె రెండు బంతులు స్టాండ్స్‌కు తరలించాడు. కానీ, తన తర్వాతి ఓవర్లోనే బ్రాస్‌వెల్‌.. ఫుల్‌లెంగ్త్‌ బంతితో రోహితను ఎల్బీగా అవుట్‌ చేశాడు. కొద్దిసేపటికే రహానె కూడా అనవసర షాట్‌ ఆడి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వైస్‌ కెప్టెన్‌ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. కోహ్లీ, మనీష్‌ పాండే తో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు వంద పరుగుల వద్ద పాండే.. వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ… ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మరోవైపు 55 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత మ రింత జోరు పెం చాడు. కోహ్లీ తప్పిదంతో ధోనీ రనౌటవడంతో నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కేదార్‌ జాదవ్‌ సహకారంతో కోహ్లీ లాంఛనం పూర్తి చేశాడు. సోధి బౌలింగ్‌లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

బౌలర్లు భళా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు రెండో ఓవర్లోనే పాండ్యా షాకిచ్చాడు. తన బౌలింగ్‌లో మూడు బౌండ్రీలు బాదిన ఓపెనర్‌ గప్టిల్‌ను ఆఖరు బంతికి అవుట్‌ చేసి బదులు తీర్చుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐదో ఓవర్లో ఉమేశ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే రాస్‌ టేలర్‌ను అవుట్‌ చేసిన ఉమేశ్‌ హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ ఆండర్సన్‌ ఆ చాన్స్‌ ఇవ్వలేదు. ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా ప్రమాదకర అండర్సన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. తన తర్వాతి ఓవర్లోనే ఫుల్‌లెంగ్త్‌ బంతితో రోంచీని పాండ్యా డకౌట్‌ చేశాడు. దీంతో… స్కోరుబోర్డుపై కనీసం యాభై పరుగులైనా చేరకముందే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నీషమ్‌, లాథమ్‌ జట్టును ఆదుకున్నారు. కానీ, ధోనీ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ కేదార్‌ జాదవ్‌ను బౌలింగ్‌కు దించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టిన జాదవ్‌ వరుస బంతుల్లో నీషమ్‌, శాంట్నర్‌ను అవుట్‌ చేశా డు. దీంతో 65 పరుగులకే కివీస్‌ ఏడు వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న సౌథీ

ఒకవైపు వికెట్లు పడుతున్నా ‘లాథమ్‌’ తన పోరాటాన్ని కొనసాగించాడు. మిశ్రా వేసిన 27 ఓవర్లో సింగిల్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతనికి ‘బ్రేస్‌వెల్‌’ కాసేపు సహకరించాడు. బ్రేస్‌వెల్‌ను ఎట్టకేలకు మిశ్రా అవుట్‌ చేశాడు. అప్పటికి కివీస్‌ స్కోరు 106/8. ఈ దశలో టిమ్‌ సౌథీ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. మిశ్రా, అక్షర్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఉమేశ్‌ వేసిన 40వ ఓవర్లో మరో సిక్సర్‌, బౌండ్రీ రాబట్టిన అతను కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీని 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఆ వెంటనే మిశ్రా బౌలింగ్‌లో అతను పాండేకు క్యాచ్‌ ఇవ్వడంతో తొమ్మిదో వికెట్‌కు 71 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. తన తర్వాతి ఓవర్లోనే ‘ఇష్‌ సోధి’ని కూడా మిశ్రా ఎల్బీగా అవుట్‌ చేయడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరుబోర్డు :

న్యూజిలాండ్‌ : గప్టిల్‌ (సి) రోహిత్ (బి) హార్దిక్‌ 12, లాథమ్‌ (నాటౌట్‌) 79, విలియమ్సన్‌ (సి) మిశ్రా (బి) ఉమేశ్‌ 3, టేలర్‌ (సి) ధోనీ (బి) ఉమేశ్‌ 0, ఆండర్సన్‌ (సి) ఉమేశ్‌ (బి) హార్దిక్‌ 4, రోంచి (సి) ఉమేష్‌ (బి) హార్దిక్‌ 0, నీషమ్‌ (సి అండ్‌ బి) కేదార్‌ 10, శాంట్నర్‌ (సి) ధోనీ (బి) కేదార్‌ 0, బ్రేస్‌వెల్‌ (సి) రహానె (బి) మిశ్రా 15, సౌథీ (సి) పాండే (బి) మిశ్రా 55, ఇష్‌ సోధి (ఎల్బీ) మిశ్రా 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 43.5 ఓవర్లలో 190 ఆలౌట్‌;

భారత్ : రోహిత్ (ఎల్బీ) బ్రాస్‌వెల్‌ 14, రహానె (సి) రోంచి (బి) నీషమ్‌ 33, కోహ్లీ (నాటౌట్‌) 85, పాండే (సి) విలియమ్సన్‌ (బి) సోధి 17, ధోనీ (రనౌట్‌) 21, కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 33.1 ఓవర్లలో 194/4;

Tags : , , , , , , , , ,