టీమ్‌ఇండియా దెబ్బకు నెం.1 దిగొచ్చింది !

surendra a
team-india

సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన కోహ్లీసేన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానం కైవసం

సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాటం సాగుతున్న సమయాన.. ఆ దేశ క్రికెట్‌ జట్టును వెనక్కి నెట్టి భారత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడం విశేషం.

దాదాపుగా కాన్పూర్‌ టెస్టు తరహాలోనే సాగిన రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియానే విజయం వరించింది. కోల్‌కతా ఈడెన్‌లో విజయం కోసం చివరి రోజు వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. నాలుగో రోజు, సోమవారం కివీస్‌కు 376 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్‌.. కివీస్‌ 197 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (74; 148 బంతుల్లో 8×4) మినహా అందరూ విఫలమయ్యారు. అంతకు ముందు ఉదయం ఓవర్‌నైట్‌ స్కోరు 227/8తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మరో 13.3 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 263 పరుగులకు ఆలౌటైంది. సాహా (58 నాటౌట్‌; 120 బంతుల్లో 6×4) అర్ధశతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. భువనేశ్వర్‌ 23 పరుగులకు ఔటయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన అర్ధశతకాలు సాధించిన సాహా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఉదయం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ గంట పైనే సాగింది ఆ తర్వాత కివీస్‌ ఓపెనర్లు గంట పైనే బ్యాటింగ్‌ చేశారు. లంచ్‌ విరామానికి కివీస్‌ స్కోరు 55/0. అప్పటిదాకా సాగిన ఆట చూస్తే మ్యాచ్‌ కచ్చితంగా ఐదో రోజు కూడా జరుగుతుందని అనుకున్నారంతా. రెండో సెషన్‌ పూర్తయ్యే సరికి కూడా కివీస్‌ స్కోరు 135/3. కానీ చివరి సెషన్లో ఏడు వికెట్లతో భారత బౌలర్లు కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక ఛేదన స్కోరు 117 పరుగులే కావడంతో వర్షం అడ్డుకుంటే తప్ప.. న్యూజిలాండ్‌ ఓటమి ఖాయమని ఆ జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందే తేలిపోయింది. ఐతే న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఆడిన తీరు చూస్తే.. ఆ జట్టు పోరాటాన్ని ఐదో రోజు కూడా జరుగుతుందేమో అనిపించింది. లాథమ్‌ నిలకడగా ఆడుతుంటే.. సిరీస్‌లో తొలిసారి పట్టుదలతో క్రీజులో నిలిచిన గప్తిల్‌ (24) కూడా భారత బౌలర్లను అడ్డుకున్నాడు. చివరికి లంచ్‌ తర్వాత ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో అశ్విన్‌, గప్తిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వికెట్ల వేటకు తెరతీశాడు. తర్వాత రెండో వికెట్‌ కోసం భారత్‌ మరో 19 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. మరోవైపు లాథమ్‌ తన మొండి పట్టుదలను కొనసాగించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతడికి రోంచి (32) తోడవడంతో భారత బౌలర్లకు మళ్లీ శ్రమ తప్పలేదు.

ఐతే ‘టీ ‘విరామానికి వెళ్లొచ్చాక కథ మారింది. ఈ సెషన్‌ రెండో ఓవర్లోనే లాథమ్‌ ఔటవడంతో పతనానికి దారిచూపినట్లయింది. అశ్విన్‌, జడేజా రెండు వైపులా ఒత్తిడి పెంచుతూ క్రమం తప్పకుండా వికెట్లు తీయగా.. తర్వాత షమి కూడా రంగంలోకి దిగి న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు. దీంతో చివరి 7 వికెట్లను ఆ జట్టు 56 పరుగుల తేడాలో కోల్పోయింది. రెండో రోజు వర్షం వల్ల కొంత ఆట నష్టపోవడంతో నాలుగో రోజు 90 ఓవర్ల కంటే ఎక్కువ వేయడానికి అంపైర్లు అనుమతించారు. కివీస్‌ ఆలౌటయ్యే వరకు ఆట కొనసాగించారు. సోమవారం మొత్తం 94.4 ఓవర్లు పడ్డాయి. షమి బౌలింగ్‌లో బౌల్ట్‌ క్యాచ్‌ను విజయ్‌ అందుకోవడంతో మ్యాచ్‌, సిరీస్‌, నెంబర్‌వన్‌ ర్యాంకు భారత్‌ సొంతమయ్యాయి.

స్కోరు బోర్డు :

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 316;

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 204;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : ధావన్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 17; విజయ్‌ (సి) గప్తిల్‌ (బి) హెన్రీ 7; పుజారా ఎల్బీ (బి) హెన్రీ 4; కోహ్లి ఎల్బీ (బి) బౌల్ట్‌ 45; రహానె (సి) బౌల్ట్‌ (బి) హెన్రీ 1; రోహిత్‌ (సి) రోంచి (బి) శాంట్నర్‌ 82; అశ్విన్‌ ఎల్బీ (బి) శాంట్నర్‌ 5; సాహా నాటౌట్‌ 58; జడేజా (సి) నీషమ్‌ (బి) శాంట్నర్‌ 6; భువనేశ్వర్‌ (సి) నికోల్స్‌ (బి) వాగ్నర్‌ 23; షమి (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (76.5 ఓవర్లలో ఆలౌట్‌) 263;

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : లాథమ్‌ (సి) సాహా (బి) అశ్విన్‌ 74; గప్తిల్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 24; నికోల్స్‌ (సి) రహానె (బి) జడేజా 24; రాస్‌ టేలర్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 4; రోంచి (బి) జడేజా 32; శాంట్నర్‌ ఎల్బీ (బి) షమి 9; వాట్లింగ్‌ (బి) షమి 1; హెన్రీ (సి) కోహ్లి (బి) జడేజా 18; జీతన్‌ పటేల్‌ (బి) భువనేశ్వర్‌ 2; వాగ్నర్‌ నాటౌట్‌ 5; బౌల్ట్‌ (సి) విజయ్‌ (బి) షమి 4; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం: (81.1 ఓవర్లలో ఆలౌట్‌) 197;

Tags : , , , , , , , , ,